Thursday, February 21, 2008

సొమ్ములు కన్నా సంసారమే మిన్న!

అవసరమైతే విలాసాలు త్యాగం దంపతుల్లో ఒకరి ఉద్యోగం చాలు 95 శాతం హైదరాబాదీల అభిప్రాయం ఇదే న్యూఢిల్లీ: సంతృప్తికరమైన వివాహ జీవితం కోసం ఉద్యోగాలు చేసే దంపతుల్లో ఒకరు దాన్ని విడిచిపెట్టడానికీ, విలాసాలను తగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ కోసం సైనోవేట్ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్ నగరాల్లోని కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న జంటలపై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 52 శాతం మంది తమకు అవకాశమొస్తే ఇంట్లో ఒకరే ఉద్యోగం చేస్తూ, సంతృప్తికరమైన వివాహ బంధానికి, తక్కువ విలాసాలకు మొగ్గు చూపుతామని పేర్కొన్నారు. 48 శాతం మాత్రం తమకు విలాసవంతమైన జీవితం కావాలని, అందుకే ఇద్దరం పనిచేస్తామని తేల్చి చెప్పారు. నగరాలపరంగా చూస్తే ఢిల్లీ, పుణేవాసులు విలాసవంతమైన జీవనానికి మొగ్గు చూపగా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయివాసులు ఒకే జీతానికి, ఆనందకర వివాహ జీవితానికి అనుకూలంగా స్పందించారు. ముఖ్యంగా హైదరాబాదీల్లో 95 శాతం మంది ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో 87 శాతం మంది తమ సంసారం సాఫీగానే కొనసాగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఒకరితో మరొకరు విలువైన సమయాన్ని గడపడం, కార్యాలయానికి ప్రయాణం తదితర విషయాల్లో గొడవలు జరగడమూ సాధారణమేనని 56 శాతం మంది పేర్కొంటున్నారు. రెండు జీతాలు వచ్చే కుటుంబాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తి చివరకు అవి విడాకులకు దారి తీసే అవకాశాలున్నాయని 34 శాతం మంది తెలిపారు.
(ఈనాడు నుంచి ...)